టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) తీసుకున్న నిర్ణయం జియో కస్టమర్లను నిరాశకు గురి చేస్తోంది. ట్రాయ్ తాజాగా ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీలు(ఐయూసీ) మరో సంవత్సరం పాటు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ కంపెనీలు ఐయూసీ చార్జీలు వసూలు చేస్తామని కొన్ని రోజుల క్రితం ప్రకటించినా ఆ తరువాత ఐయూసీ చార్జీల విషయంలో వెనక్కు తగ్గాయి. 
 
జియో మాత్రం కస్టమర్ల నుండి ఐయూసీ చార్జీలను వసూలు చేస్తోంది. ఐయూసీ చార్జీల కింద ఒక నెట్ వర్క్ నుండి మరో నెట్ వర్క్ కు కాల్ చేస్తే టెలికాం కంపెనీలు నిమిషానికి 6 పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ట్రాయ్ చేసిన ప్రకటన ప్రకారం 2021 జనవరి1వ తేదీ నుండి ఐయూసీ చార్జీలు ఉండవు. ట్రాయ్ తీసుకున్న నిర్ణయంతో జియో వినియోగదారులపై అదనపు భారం పడింది. నిజానికి ఈ నెల 31తో ఐయూసీ చార్జీలు రద్దయ్యే అవకాశం ఉందని గతంలో ట్రాయ్ ప్రకటించింది. 
 
కానీ ఈ నిర్ణయాన్ని ట్రాయ్ ఏడాది కాలం వాయిదా వేసింది. గతంలో ఐయూసీ చార్జీలు 14 పైసలుగా ఉండగా 2017 సెప్టెంబర్ నెలలో 6పైసలకు తగ్గిస్తూ ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. ట్రాయ్ తీసుకున్న నిర్ణయం వలన వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ కు లాభం చేకూరనుంది. జియో గతంలో ఐయూసీ చార్జీల భారాన్ని మోసినప్పటికీ ఇప్పుడు ఆ భారం కస్టమర్లపై వేసింది. ఐయూసీ చార్జీలను రద్దు చేయాలని జియో ఎప్పటినుండో ట్రాయ్ ను కోరుతూనే ఉంది. 
 
మరోవైపు ట్రాయ్ ఫోన్ కాల్స్, డేటా కోసం కనీస ధరల పెంపు నిర్ణయానికి సంప్రదింపులను ప్రారంభించింది. కనీస ధరల గురించి ట్రాయ్ అభిప్రాయ సేకరణ చేపట్టింది. ట్రాయ్ పరిశ్రమ భాగస్వామ్యులను వచ్చే నెల 17వ తేదీ వరకు తమ విలువైన సూచనలను, సలహాలను ఇవ్వాలని కోరింది. నిపుణులు ఉచిత కాల్స్, చౌక డేటాకు కాలం చెల్లినట్లే అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: