కరోనా... ఈ పేరు వింటే చాలు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రోజురోజుకు ఈ వైరస్ వేగంగా విజృంభిస్తూ ఉండటంతో వేల సంఖ్యలో కరోనా బాధితులు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావంతో చైనా ఆర్థికంగా దెబ్బతింటోంది. తాజాగా కరోనా వైరస్ ప్రభావం భారత వ్యాపార రంగంపై కూడా పడుతున్నట్టు తెలుస్తోంది. రాబోయే 20 రోజుల్లో ఈ వైరస్ ప్రభావం వలన స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయని సమాచారం. 
 
పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం స్మార్ట్ ఫోన్లతో పాటు, ఫీచర్ ఫోన్ల ధరలు, మొబైల్ ఫోన్ల విడిభాగాల ధరలు భారీగా పెరగనున్నట్టు తెలుస్తోంది. ఫీచర్ ఫోన్లు, విడి భాగాలు దాదాపు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని స్మార్ట్ ఫోన్ల ధరలు మాత్రం 6 నుండి 7 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై మాత్రం ఈ ప్రభావం పెద్దగా పడదని తెలుస్తోంది. 
 
భారత్ లో ప్రీమియం స్మార్ట్ ఫోన్లను వినియోగించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అందువలన కరోనా ప్రభావం ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై పడదని తెలుస్తోంది. కరోనా వైరస్ ప్రభావంతో చైనాలోని పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. మొబైల్ విడిభాగాలు తయారయ్యే కంపెనీలు కూడా మూతపడ్డాయి. కరోనా వైరస్ ప్రభావం రాబోయే ఆరు నెలల పాటు ఉండనుందని తెలుస్తోంది. 
 
ఇప్పటికే షావోమీ కంపెనీ కరోనా వైరస్ ప్రభావంతో కొన్ని మోడళ్ల ధరలను పెంచేసింది. మరోవైపు చైనాలో కరోనా బారిన పడి 1665 మంది మృతి చెందారు. ఇప్పటికే 28 దేశాలకు వ్యాపించిన కరోనా బాధితుల సంఖ్య 69,000 కు చేరుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: