గురువారం రోజు ఒక లక్షా 70 వేల వినియోగదారుల ఖాతాలను ట్విట్టర్ సంస్థ తొలగించింది. ఈ ఖాతాదారులంతా మోసపూరిత కథనాలను ట్విట్టర్ వేదికగా వ్యాప్తి చేస్తున్నారు. అయితే చైనా భాషలో వ్యాప్తి చెందుతున్న ఈ కథనాలన్నీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా విధానానికి అనుకూలంగా ఉన్నాయని ట్విట్టర్ అధికారులు వెల్లడించారు. హాంకాంగ్ నిరసనలు, కొవిడ్-19 సంక్షోభం, ఇంకా తదితర సున్నితమైన అంశాలపై ఈ కథనాలు ఉన్నాయని, అవన్నీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కు మద్దతుగా ఉన్నాయని ట్విట్టర్ సంస్థ తెలిపింది. 


ఒక లక్షా 70 వేల ట్విట్టర్ వినియోగదారులు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా కు మద్దతుగా ఎన్నో ప్రాంతీయ రాజకీయల కథనాలను తమ ఫ్లాట్ ఫామ్ ద్వారా వ్యాప్తి చేస్తున్నారని... అది తమ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి వ్యతిరేకమని... అందుకే ఆ అకౌంట్స్ లని తొలగించామని ట్విట్టర్ సంస్థ వెల్లడించింది. నిజానికి చైనా దేశంలో ట్విట్టర్ సేవలు నిలిపివేయపడ్డాయి కానీ కొంతమంది VPN వినియోగిస్తూ ట్విట్టర్ వెబ్ సైట్ ని యాక్సెస్ చేస్తున్నారు. 


మోసపూరితమైన కథనాలు రాసేవారు, వ్యాప్తి చేసే వారు కూడా విదేశాల్లో నివసిస్తున్న చైనీయులను టార్గెట్ చేసేందుకు ట్విట్టర్ ని వినియోగిస్తూ తమ పార్టీ మద్దతును పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. 23, 750 ఖాతాదారులు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు సానుకూలంగా మోసపూరితమైన కథనాలు రాస్తున్నారని ట్విట్టర్ సంస్థ గుర్తించింది. అయితే గతంలోనూ వీరందరూ అమెరికా హాంకాంగ్ నిరసనలపై తప్పుడు కథనాలు ప్రచారం చేసినట్టు గుర్తించామని స్టాన్‌ఫొర్డ్‌ ఇంటర్నెట్‌ అబ్జర్వేటరీ మేనేజర్‌ రినీ డీరెస్టా వెల్లడించారు. మిగతా ఒక లక్షా 50వేల ఖాతాదారులు మోసపూరితమైన కథనాలను రీట్వీట్ ద్వారా ప్రచారం చేస్తున్నట్టు ట్విట్టర్ సంస్థ గుర్తించింది. 23, 750 కీలకమైన ఖాతాదారులు 348,608 ట్వీట్స్ చేసినట్టు తేలింది. 2019 ఆగస్టు నెలలో కూడా కొంత మంది ఖాతాదారులు వీరి లాగానే హాంకాంగ్ నగరంలో చైనా దేశం గురించి ప్రచారం చేస్తుంటే ట్విట్టర్ సంస్థ వారందరి ఖాతాలను తొలగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: