గంటా శ్రీనివాసరావు...ప్రతి ఎన్నికలకు నియోజకవర్గాలు మారి గెలుపు గుర్రం ఎక్కడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. అలాగే పార్టీలు కూడా మారడం గంటాకు అలవాటైన పని. 1999 ఎన్నికల్లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన గంటా...ఆ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో చోడవరం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు.

 

ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడంతో అందులోకి వెళ్లి 2009 ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే తర్వాత ప్రజారాజ్యంలో కాంగ్రెస్ లో విలీనం కావడంతో, ఆ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ, మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. అయితే తర్వాత రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పని అయిపోవడంతో, మళ్ళీ టీడీపీలోకి వచ్చి 2014 ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించి, చంద్రబాబు కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసారు. ఇక 2019 ఎన్నికల్లో అదే టీడీపీ నుంచి విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో గెలిచారు.

 

ఇక అధికారం లేకపోవడంతో గంటా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఒకానొక సమయంలో గంటా పార్టీ మారిపోతారని ప్రచారం కూడా జరిగింది. ఒకసారి బీజేపీలోకి వెళ్తారని, మరొకసారి వైసీపీలోకి వెళ్తారని వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఏ పార్టీలో చేరకుండా టీడీపీలోనే కొనసాగుతున్నారు. అలా అని గంటా నియోజకవర్గంలో యాక్టివ్ గా పనిచేయడం లేదు. పెద్దగా తనని గెలిపించిన ప్రజల మొహం కూడా చూడటం లేదు. ఇటు అసెంబ్లీకి పెద్దగా హాజరు కావడం లేదు. అదేవిధంగా టీడీపీ పార్టీ సమావేశాలకు, కార్యక్రమాలకు అసలు రావడం లేదు.

 

అయితే నియోజకవర్గాన్ని గంటా వదిలేసినా, గంటా మీద ఓడిపోయిన వైసీపీ  నేత కేకే రాజు మాత్రం వదల్లేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తున్నారు. విజయసాయిరెడ్డి అండతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. ఇక 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీలో గెలిచిన విష్ణుకుమార్ రాజు కూడా, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. తనకు సాధ్యమైన సాయం చేస్తున్నారు. కానీ గంటా మాత్రం సైలెంట్ గా ఇంట్లోనే ఉంటున్నారు. మొత్తానికైతే విశాఖ ఉత్తరంలో 'గంటా' మోగడం లేదనే చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: