సినిమా ఇండస్ట్రీలో రజినీకాంత్ కు సూపర్ స్టార్ ఇమేజ్ తో పాటు మరో పేరు ఉంది. సాదాసీదాగా జీవించడంలో రజినీ తర్వాతే ఎవరైనా అని. ఈ విషయమై అనేక మంది పలు వేదికలపై గొప్పగా చెబుతూంటారు కూడా. జీవితంలో ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయనలా సాదాసీదాగా జీవించడం కష్టమైన పని అని అంటారు. అందుకు ఆయన జీవనశైలి ప్రత్యక్ష ఉదాహరణ. రజినీ స్టైల్ తో పాటు ఆయన సామాజిక సేవకు అభిమానులుగా మారినవారున్నారు.



తమిళ్ లో విజయశేఖరన్ దర్శకత్వంలో ‘ఎవనుం బుద్దనిల్లై’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా పాటలు, ట్రైలర్‌ విడుదల కార్యక్రమం చెన్నైలోని కమలా థియేటర్‌లో జరిగింది. దర్శకుడు ఆర్‌వీ ఉదయకుమార్‌, ఆర్‌కే సెల్వమణి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌వీ ఉదయకుమార్‌ మాట్లాడుతూ.. ‘‘క్యారవాన్‌ సంస్కృతి వచ్చాక నిర్మాతలకు కష్టాలు మొదలయ్యాయి.  రజనీకాంత్‌తో నేను ‘యజమాన్‌’ సినిమా చేసినప్పుడు షూటింగ్‌ స్పాట్‌లో కొబ్బరిమట్టపైనే నిద్రించేవారు రజినీ. అంత నిరాడంబరంగా జీవిస్తున్న వ్యక్తి రజనీ. నిర్మాతల కష్టసుఖాలు ఎరిగి ప్రవర్తించేవారు. దీంతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనబడటంలేదు’’ అని అన్నారు. రజినీ గురించి ఇటువంటి కథనాలు గతంలో కూడా వినవచ్చాయి. శివాజీ సినిమా రిలీజయ్యాక తన స్నేహితుడి ఇంటికి వెళ్లి కటిక నేలపై బనీయన్ పై పడుకుని విశ్రాంతి తీసుకున్నారని అంటారు. 



రజినీకాంత్ ఎవరో తెలియని మహిళ ఓ గుడి వద్ద రజినీ గెడ్డంతో ఉండటం చూసి పది రూపాయలు ఇచ్చిందట. విషయం తెలుసుకుని రజినీ వద్దకు వెళ్లగా “నువ్వు ఇచ్చిన పది రూపాయలు నేనేంటో తెలియజేసింది. ఇందులో ఏం తప్పు లేదు” అంటూ వెళ్లిపోయారట. అంత నిరాడంబరంగా జీవిస్తారు కాబట్టే రజినీకి అంతటి ఫాలోయింగ్ సాధ్యమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: