నిజామాబాద్ లోక్ సభ స్థానం లో ఘోర పరాజయం చెందిన టీఆరెస్ అధినేత,  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను  మంత్రివర్గం లోకి తీసుకోవాలని పార్టీ వర్గాలు కోరుతున్నాయి. ఈ మేరకు త్వరలోనే కేసీఆర్ ను కలిసి తమ మనస్సులోని మాటను వెల్లడిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్టం లో త్వరలోనే మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్న నేపధ్యం లో కవితకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి  మంత్రి వర్గం లోకి తీసుకుని, రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని అంటున్నారు.

నిజామాబాద్ లోక్ సభ స్థానం లో కవిత ఓటమి కి కుమ్మక్కు రాజకీయాలే కారణమని భావిస్తోన్న టీఆరెస్ నాయకత్వం, ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడను తిప్పికొట్టేందుకు కవిత ను మంత్రివర్గం లోకి తీసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి త్వరలోనే మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశాలున్న నేపధ్యం లో కవితను మంత్రివర్గం లోకి తీసుకోవాలన్న ప్రతిపాదన టీఆరెస్ వర్గాల నుంచి తెరపైకి రావడం వ్యూహాత్మక ఎత్తుడగానే భావించాల్సిదేనని, అంత ఆషామాషీగా చేస్తోన్న ప్రతిపాదన ఏమి కాదని  పేర్కొంటున్నారు.

కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదా లో కేటిఆర్ పార్టీ పనుల్లో తలమునకలు గా ఉండడం తో ఆయన్ని మంత్రి వర్గం లోకి తీసుకునే అవకాశాలు అంతంత మాత్రంగానే కన్పిస్తున్నాయి. కేటీఆర్ ను కాదని హరీష్ రావు ను ముఖ్యమంత్రి తన మంత్రివర్గం లోకి తీసుకునే అవకాశాలు ఎంతమాత్రం కన్పించడం లేదు, కేటీఆర్ ను కాదని హరీష్ కు మంత్రి పదవి కట్టబెడితే ఆయన కీలక పవర్ సెంటర్ ఎదిగే అవకాశాలున్నాయని టీఆరెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే ఇరువురికి మంత్రి వర్గ విస్తరణ లో పదవి కట్టబెట్టకపోతే,  తమ కుటుంబ సభ్యురాలి హోదా లో కవిత కు కేసీఆర్ అవకాశం కల్పించిన పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

తెలంగాణ మంత్రివర్గం లో ప్రస్తుతం మహిళా మంత్రి లేకపోవడం కూడా కవితకు కలిసొచ్చే అంశమని అంటున్నారు. అయితే పార్టీ వర్గాల నుంచి వెల్లువెత్తుతోన్న తాజా డిమాండ్ తో టీఆరెస్ లోని సీనియర్ మహిళా శాసనసభ్యురాలు ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లూ మంత్రి వర్గ విస్తరణ లో తమకు అవకాశం దక్కుతుందేమోనని ఆశించిన వారికి, ప్రస్తుత పరిణామాలు ఏమాత్రం మింగుడు పడడం లేదు . ఒకవేళ ముఖ్యమంత్రి తన కుమార్తె ను మంత్రి వర్గం లోకి తీసుకోవాలని భావిస్తే, ఇతర మహిళ ఎమ్మెల్యేలకు మంత్రి వర్గం లో చోటు దక్కే అవకాశాలు ఉండకపోవచ్చునని ఆందోళన చెందుతున్నారు. అయితే లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ అంతటి  ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు ఉండకపోవచ్చునని మరికొంతమంది భావిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: