విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిన వారు సులభంగా నగదు, వస్తువులను దొంగలించటం కోసం హాస్టళ్లలో చేరి దోచుకుంటున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మహిళ దొంగతనాన్ని తన వృత్తిగా మార్చుకుంది. లేడీస్ హాస్టళ్లలో చేరి బంగారు ఆభరణాలు, మొబైల్, ఏటీఎం కార్డ్, నగదు చోరీ చేస్తోంది. ప్రస్తుతం నెల్లూరు పోలీసులు దొంగతనం చేసిన మహిళ కోసం గాలిస్తున్నారు. గతంలో దొంగతనం కేసులో జైలు శిక్ష అనుభవించిన ఈ మహిళ జైలు నుండి బయటకు వచ్చిన తరువాత కూడా ఏం మారలేదు.

నెల్లూరులోని ఒక ప్రైవేట్ హాస్టల్ లో కొన్ని రోజుల క్రితం ఒక మహిళ చేరింది. ఇదే హాస్టల్ లో ఒక బ్యాంకు ఉద్యోగిని కొన్ని నెలల నుండి ఉంటోంది. ఒకరోజు బ్యాంకు ఉద్యోగిని స్నానానికి వెళ్లిన సమయంలో  మహిళ యువతి యొక్క ఏటీఎం, 4 వేల రుపాయల నగదు, మొబైల్ తీసుకొని హాస్టల్ నుండి పరారయింది. 
 
కొంత సమయం తరువాత మొబైల్, డబ్బు, ఏటీఎం మిస్ అయ్యాయన్న విషయాన్ని గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. హాస్టల్ నిర్వాహకులు ఎటువంటి గుర్తింపు కార్డులు తీసుకోకుండానే దొంగతనం చేసిన మహిళకు గది కేటాయించారనే విషయం తెలిసి పోలీసులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
గతంలో హరనాథపురం ప్రాంతంలోని హాస్టల్ లో ఒక మహిళ ఫోను, నగదు దొంగతనం చేసిన ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. గతంలో చిన్న బజారు పోలీసులు అరెస్ట్ చేసిన మహిళనే ఈ రెండు ఘటనల్లో నిందితురాలని పోలీసులు గుర్తించారు. నిందితురాలిని గుర్తించటంతో పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. నెల్లూరు నగరంలోని హాస్టళ్లలో నిర్వాహకులు ఎటువంటి నిబంధనలు పాటించకపోవటం వలనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రైవేట్ కంపెనీలు, బ్యాంకులలో పనిచేసేవారు ఎక్కువగా నెల్లూరు జిల్లాలోని హాస్టళ్లలో ఉంటున్నారని తెలుస్తోంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: