అటు ప్రభుత్వ నిర్వాకంమో, చేతాగానితనమో, ఆర్టీసీని ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే ప్రభుత్వ పెద్దల ఉద్దేశమో? ఇటు ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్ట్ ఆక్షేపణలతో పలుమార్లు సంశయాలతో ప్రశ్నలతో విచారణలను వాయిదాలు వెస్తూ ఉన్న నేపధ్యంలో ఆర్టీసీ భవితవ్యం "త్రిశంఖు స్వర్గం" లో పడింది. చిత్తశుద్ధిలేని ప్రభుత్వం  చేస్తున్న పనులవల్ల ఆర్టీసి సమస్య ఒక కొలిక్కి రావడం లేదు. దీనిపై హైకోర్టు తీవ్ర అసహనం, ఆగ్రహం, అభ్యంతరం వ్యక్తం చేసింది.


ఆర్టీసీ శ్రామికుల సమ్మెపై హైకోర్టులో వాదనలు జరిగాయి. హైకోర్టు మరోసారి నిన్న ప్రభుత్వంపై తన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకనైనా మీరు మారరా! అంటూ! హైకోర్ట్ ప్రభుత్వానికి పరోక్షంగా, ఆర్టీసీకి ప్రత్యక్షంగా హెచ్చరికలు చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం: 


*ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, 
*బకాయిలు, 
*రాయితీలు 


పై వాటికి సంబంధించి హైకోర్టుకు ప్రభుత్వం తన నివేదిక సమర్పించింది అదీ హైకోర్ట్ చేసిన పలు వ్యాఖ్యానాల తరవాతనే. ఆర్టీసి హైకోర్టుకు సమర్పించిన  గణాంకా లన్నీ అంకెల గారడీగా,  తప్పుల తడకలుగా, అసత్యాలు అర్ధసత్యాలుగా హైకోర్టు పసిగట్టినట్లే ఉంది.  మరీ ముఖ్యంగా  బస్సుల కొనుగోలుకు ఋణాలుగా అందించిన మొత్తాలను రాయితీల కింద ఇచ్చినట్లు చూపిస్తూ ఆర్టీసి తయారు చేసిన నివేదిక నిర్వాకం తమను తప్పుదారి పట్టింప జూసినట్లే హైకోర్టు ఆలోచిస్తున్నట్లే ఉంది.


అందుకే హైకోర్ట్ ఆర్టీసి ఇన్ చార్జ్ ఎండీని నిగ్గదీసింది. కారణం ఈ నివేదిక తయారీ వెనుక ప్రభుత్వం ఉన్నట్లే హైకోర్టు భావించి ఉండవచ్చు  హైకోర్టు తీవ్రంగా తీవ్రంగా చేసిన ఆక్షేపణల  ద్వారా అర్ధమౌతుంది. బస్సుల కోసం ఋణం ఇచ్చి, దాన్ని రాయితీ కింద ఎలా చూపిస్తారు? అని ప్రశ్నించింది హైకోర్టు. 


రాయితీల బకాయిల్ని డీజిల్, జీతాల చెల్లింపులకోసం ఉపయోగించామని ఆర్టీసీ ఇన్-చార్జ్ ఎండీ కోర్టుకు తమ నివేదికల ద్వారా విన్నవించారు. కానీ ఆ విషయం నివేదిక లో కనిపించలేదు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్టీసీకి చెల్లించాల్సిన రాయితీ మొత్తం ₹644 కోట్లను విడుదల చేసినట్టు నివేదికలో చెప్పారు. కానీ ఆర్టీసీ కార్మిక సంఘాలు మాత్రం ఆ అంశాన్ని తప్పుబట్టాయి. రకరకాల తప్పుల లెక్కలు చూపించి, రాయితీలు ఇచ్చామంటే ఎలా అని ప్రశ్నించాయి. 


మరోవైపు జీహెచ్ఎంసీ వ్యవహారం కూడా చర్చకు వచ్చింది. నిబంధనల ప్రకారం, హైదరాబాద్ లో బస్సులు తిప్పుతున్నందుకు జీహెచ్ఎంసీ కొంత మొత్తాన్ని ఆర్టీసీకి చెల్లించాలి. అలా చెల్లించాల్సిన బకాయిలు ₹1786 కోట్ల రూపాయల మేర ఉన్నాయి. కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా కేవలం ₹336 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించామని జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ విషయాన్ని కూడా నివేదికలో పొందు పరిచింది ప్రభుత్వం. ఈ అంశాన్ని కూడా హైకోర్టు తప్పుపట్టింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పూర్తి లాభాల్లో కొనసాగుతున్న విషయం జగమెరిగిన సత్యమని ఇప్పుడైనా అప్పులలెక్కలు సొమ్ము చెల్లించవచ్చని అలా ఎందుకు చేయట్లేదని ప్రశ్నించింది. తద్వారా నివేదికలో చాలా అవకతవకలున్నాయని హైకోర్ట్ గుర్తించినట్లు తన ప్రశ్నలద్వారా ఆక్షేపణల ద్వారా ప్రజలకు తెలిసిపోతుంది. 


సరిచేసి సరైన గణాంకాలతో తిరిగి మరో ఐదు రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి వాదనలను వచ్చే గురువారానికి వాయిదా వేసింది. హైకోర్టులో ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఆర్టీసీ సమస్య యథాతథంగా కొనసాగుతోంది. ఈరోజు కూడా వివిధ ప్రాంతాల్లో సమ్మెలు కొనసాగాయి. హైకోర్టులో ప్రభుత్వానికి మరోసారి అక్షింతలు పడడం, ఇచ్చిన నివేదికలో తప్పుల్ని హైకోర్టు ఎత్తిచూపడంతో నేడు జరగనున్న కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ ప్రైవేటీకరణపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: