ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధుల్లో చేరి రెండు నెలలు దాటినా ఇప్పటివరకు గ్రామ సచివాలయ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ కాలేదు. జీతాలు జమ కాకపోవటంతో విధుల్లో చేరిన ఉద్యోగులు కొంత అసంతృప్తికి లోనవుతున్నారన్న మాట వాస్తవం. పంచాయతీ రాజ్ శాఖ గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాలను కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రైవేట్ ఏజెన్సీల ఆధ్వర్యంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించే 301, 302 ఖాతాల్లో బిల్లులు పెట్టాలన్న ఆదేశాలతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 
 
చాలా జిల్లాల్లో 301, 302 ఖాతాల్లో బిల్లులను పెట్టకుండా అధికారుల నుండి ఆదేశాల కొరకు సిబ్బంది ఎదురుచూస్తున్నారు. పురపాలక, పట్టాణాభివృద్ధి శాఖ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 010 ఖాతాలో జీతాలను చెల్లించటానికి ఆదేశాలను జారీ చేసింది. వార్డు సచివాలయ ఉద్యోగులకు అక్టోబర్, నవంబర్ నెల జీతాల కోసం బిల్లులు పెడుతోంది. 
 
గ్రామ సచివాలయ ఉద్యోగులకు 301, 302 ఖాతాల్లో బిల్లులు పెడితే ఒకసారి ఈ విధానంలో అమలు చేసిన తరువాత మరో విధానంలోకి మార్చటం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ సచివాలయ ఉద్యోగులు మాత్రం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తదుపరి ఆదేశాలను ఇవ్వాలని కోరుతున్నారు. జీతాల చెల్లింపులలో వార్డు సచివాలయ ఉద్యోగులకు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఎందుకు వేరు వేరు విధానాలు అని గ్రామ సచివాలయ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 
 
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాల గురించి ట్విట్టర్ ద్వారా స్పందించారు. వారం రోజులలోగా గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. విధుల్లో చేరి రెండు నెలలైనా జీతాలు జమ కాకపోవటంపై కొందరు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం వీలైనంత త్వరగా జీతాలు జమ చేయాలని గ్రామ సచివాలయ ఉద్యోగులు కోరుకుంటున్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: