శ్రీకాకుళం నుంచి రాష్ట్ర కేబినెట్ లో  మంత్రి గా ధర్మాన కృష్ణదాస్ కొనసాగుతున్నప్పటికీ ,  నిత్యం వార్తల్లో మాత్రం  స్పీకర్ తమ్మినేని సీతారామే ఉంటున్నారు . కృష్ణదాస్ సౌమ్యుడు కావడం తో , విపక్షాలపై విమర్శలు చేయడంలో  దూకుడు గా వ్యవహరించలేకపోతున్నారన్న టాక్ విన్పిస్తోంది  . ఇదే అదనుగా తమ్మినేని అన్ని తానే అన్నట్లు వ్యవహరిస్తూ, విపక్షాలపై విమర్శలు చేస్తూ , అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు  . స్పీకర్ గా రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతున్న తమ్మినేని, గత స్పీకర్లకు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి  .

 

రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతున్న ఆయన రాజకీయ వ్యవహారాలు పూర్తిగా దూరంగా ఉండాల్సింది పోయి ,  అదను దొరికితే చాలు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పై , ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఒంటి కాలితో లేస్తున్నారు .  విపక్షాలపై తమ్మినేని చేస్తున్న విమర్శలు వివాదాస్పదం అవుతోన్న ఆయన మాత్రం లెక్క చేయకుండా , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టిని ఆకర్షించే ప్రయత్నాన్ని చేస్తున్నారన్న టాక్ రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది .  ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను  మూడు రాజధానుల అంశం కుదిపేస్తున్న విషయం తెల్సిందే .

 

 మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తోన్న విపక్షాలపై  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు , అమాత్యులు పోటీ పడి విమర్శలు గుప్పిస్తున్నారు . అయితే ధర్మాన మాత్రం విపక్షాలు చేస్తోన్న విమర్శలను  తిప్పికొట్టడంలో వెనుకవరుసలో ఉంటే, తమ్మినేని మాత్రం ముందువరుసలో ఉంటూ  అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు . ఇటీవల అమరావతిని  రాజస్థాన్ ఎడారి తో పోల్చిన తమ్మినేని  ... వందేళ్ళు అయినా అక్కడ అభివృద్ధి జరగదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు .

 

 తాజాగా తమ్మినేని మరొక అడుగు ముందుకేశారు . అమరావతి లో జరుగుతున్న ఆందోళనలు స్థానికులు చేసేవి కావన్న ఆయన, వాటి వెనుక రాజధాని ప్రాంతం లో భూములు కొనుగోలు చేసినవారు ఉన్నారంటూ వ్యాఖ్యానించి  మరోసారి వివాదానికి తెరలేపారు . ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో వ్యక్తిగా ఉంటున్న తమ్మినేని ముందు మంత్రి అయిన కృష్ణదాస్  తేలిపోతున్నారన్న కామెంట్స్ పార్టీ వర్గాల్లోనే విన్పిస్తున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: