రాజ‌కీయాల్లో ఏదైనా అవ‌కాశ వాద‌మే..! ఏ విష‌య‌మైనా రాజ‌కీయ‌మే..!! అది ప్ర‌త్య‌ర్థి పార్టీ అయితే.. ఇక‌, చెప్పాల్సిన అవ‌స‌రం ఏ ముంటుంది? ఇప్పుడు ఇలాంటి అవ‌కాశ‌మే టీడీపీకి వ‌చ్చింది. అదే స‌మ‌యంలో మాట‌లు ప‌డే అవ‌కాశం వైసీపీకి వ‌చ్చింద‌నే చ‌ర్చ‌లు వినిపిస్తున్నాయి. వైసీపీ అధినేత‌, ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్‌కు మాట‌త‌ప్ప‌ని నాయ‌కుడిగా పేరుంది. నిజ‌మే! ఆయ‌న తీసుకున్న అనేక నిర్ణ‌యాలు.. అనేక కార్య‌క్ర‌మాల‌ను ప‌రిశీలిస్తే.. నిజ‌మేన‌ని అనిపిస్తుంది. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వా త ఎస్సీ, ఎస్టీల‌కు పెద్ద‌పీట వేస్తామ‌ని చెప్పారు. దీనికి అనుగుణంగానే ఆయ‌న ఐదుగురు ఉప ముఖ్య‌మంత్రుల‌ను నియ‌మించు కుని వీరిలో ఎస్సీ, ఎస్టీల‌కు పెద్ద‌పీట వేశారు. అదేవిధంగా రైతు భ‌రోసా రూ.12, 500 అన్నారు.

 

అయితే, ఇది స‌రిపోద‌ని చెప్ప‌డంతో మ‌రో వెయ్యి పెంచి.. చెప్పిన గ‌డువు (2020 అక్టోబ‌రు) క‌న్నా ముందుగానే 2019 అక్టోబ‌రు నుంచే ఇస్తున్నారు. ఇక‌, `అమ్మ ఒడి` కార్య‌క్ర‌మాన్ని కూడా అనుకున్న స‌మ‌యానికి రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్న విధంగా ప్ర‌జ‌ల‌కు మాట ఇచ్చిన విధంగా అమ‌లు చేశారు. ఇక‌, పార్టీలోని కీల‌క నేత‌ల‌కు కూడా ప‌ద‌వులు, అవ‌కాశాల‌ను కూడా ఆయ‌న ఇచ్చారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన వారికి ఎమ్మెల్సీలుగా అవ‌కాశం ఇచ్చి మంత్రులుగా తీసుకున్నారు. అదే విధంగా ఎన్నిక‌ల్లో టికెట్ల‌ను త్యాగం చేసిన వారికి పార్టీలో ప‌ద‌వులు  స‌హా ప్ర‌భుత్వంలోనూ ప‌ద‌వులు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. దీంతో చాలా మంది త‌మ టికెట్ల‌ను త్యాగం చేశారు. వారికి అనుకున్న విధంగానే జ‌గ‌న్ అవ‌కాశాలు క‌ల్పించారు.

 

అయితే, ఇలాంటివారిలో గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే .. వైఎస్ కుటుంబానికి ఎంతో ఆప్తుడిగా పేరు తెచ్చుకున్న మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు కూడా జ‌గ‌న్ త‌న ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌ర్వాత మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పారు.  దీంతో ఆయ‌న త‌న సీటును త్యాగం చేశారు. దాదాపు ఐదు ద‌శాబ్దాలుగా ఈ కుటుంబానికి చిల‌క‌లూరిపేట రాజ‌కీయాల్లో అనుబంధం పెన‌వేసుకుంది. రాజ‌కీయాల్లో ఇన్నేళ్లుగా విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయం చేయ‌డంలో మ‌ర్రి ముందు వ‌రుస‌లో ఉంటారు. జ‌గ‌న్ ప్ర‌చారంలో మంత్రి హామీ ఇచ్చినా ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు ఎలాంటి అవ‌కాశం కానీ, ప‌ద‌విని కానీ ఇవ్వ‌లేదు. దీంతో ఆయ‌న ఎద‌రు చూస్తున్న మాట వాస్త‌వ‌మే. అయితే, కేబినెట్‌లో స‌మీక‌ర‌ణ‌లు చూస్తే.. ఇప్ప‌టికే అన్ని సామాజిక వ‌ర్గాల‌కు చెందిన కీల‌క నాయ‌కుల‌కు అవ‌కాశం ఇచ్చారు జ‌గ‌న్‌. దీంతో మ‌రో రెండున్న‌రేళ్ల త‌ర్వాత మిగిలిన వారికి అవ‌కాశం ఇస్తార‌నేది వాస్త‌వం. కానీ, ఈ విష‌యంలో ఎవ‌రెవ‌రికి అవ‌కాశం ద‌క్కుతుంద‌నే విష‌యాన్ని జ‌గ‌న్ పైకి వెల్ల‌డించ‌డం లేదు.

 

కానీ, మ‌ర్రికి ఖ‌చ్చితంగా వ‌చ్చే రెండేళ్ల త‌ర్వాత జ‌రిగే మంత్రి వ‌ర్గం విస్త‌ర‌ణ‌లో కేబినెట్ బెర్త్ ఖాయ‌మ‌నే వాద‌న ఉంది. వ‌చ్చే ఏడాది ఎమ్మెల్సీ సీట్లు కూడా ఖాళీ అవుతాయి క‌నుక ఆయ‌న‌ను ఎమ్మెల్సీగా ప్ర‌మోట్ చేసి.. మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌నేది జ‌గ‌న్ వ్యూహం. అయితే, ఆయ‌న ఈ విష‌యాన్ని ముందుగానే వెల్ల‌డించ‌క పోవ‌డంతో తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ ర‌వి ఈ విష‌యాన్ని రాజ‌కీయంగా వాడుకున్నారు. జ‌గ‌న్ అంటే.. మాట‌త‌ప్పే.. మ‌డ‌మ తిప్పే నాయ‌కుడ‌ని, అందుకే మ‌ర్రికి అవ‌కాశం ఇవ్వ‌లేదని విమ‌ర్శ‌లు చేశారు. మ‌రి ఇలాంటి విమ‌ర్శ‌ల నుంచి బ‌య‌ట ప‌డేందుకు జ‌గ‌న్ కొంద‌రి విష‌యంలో త‌న వ్యూహాన్ని ప్ర‌క‌టిస్తేనే బెట‌ర‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: