ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం సీక్రెట్ పదవులు ఇస్తోందా...? వివిధ దేశాలకు కేబినేట్ ర్యాంక్ హోదాలతో ప్రత్యేక ప్రతినిధి పదవులు పంపిణీ చేస్తోందా..? అనే ప్రశ్నలకు వైసీపీ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవోలు బయటకు వస్తూ ఉండటంతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2019 నవంబర్ 13న ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో తాజాగా బయటకు వచ్చింది. 
 
మిడిల్ ఈస్ట్ కు గల్ఫ్ దేశాలన్నీ కవర్ చేసేలా ఒక ప్రత్యేక ప్రతినిధిని ప్రభుత్వం నియమించింది. ఈ ప్రత్యేక ప్రతినిధి ఎవరో ఏపీ ఉన్నతాధికారులకు కూడా తెలియకపోవడం గమనార్హం. ప్రభుత్వం నియమించిన ఆ వ్యక్తి పేరు జుల్ఫీ రవ్‌డిజీ. ఇతని పేరు తప్ప ఇతర వివరాలు ఎవరికీ తెలియవు. కేబినేట్ మంత్రి పదవితో సమానంగా జుల్ఫీ రవ్‌డిజీకు హోదా కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. 
 
ప్రభుత్వం జారీ చేసిన జీవోలో జూల్ఫీని ఏపీ కేబినేట్ ర్యాంక్ ప్రత్యేక ప్రతినిధిగా, బంజారాహిల్స్ నివాసిగా పేర్కొన్నారు. ప్రభుత్వం ఇతనికి భారీ మొత్తంలో జీతం రూపంలో చెల్లిస్తోంది. జీవోలో వేతనానికి సంబంధించిన వివరాలు లేకపోయినా వేతనం చెల్లింపులు మాత్రం ఉంటాయని పేర్కొన్నారు. జీవోలో జుల్ఫీని ప్రత్యేక ప్రతినిధిగా పేర్కొన్నప్పటికీ ఈయన విధులకు సంబంధించిన వివరాలేవీ లేవు. 
 
గత సంవత్సరం నవంబర్ లో జారీ అయిన జీవో తాజాగా బయటకు రావడానికి గల కారణాలు కూడా తెలియాల్సి ఉంది. జుల్ఫీ నియామకానికి సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచడంతో ప్రత్యేక ప్రతినిధుల విధుల గురించి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2019 జులైలో సెర్బియాలో నిమ్మగడ్డ అరెస్ట్ తరువాత ఈ నియామకం జరిగింది. ఈ నియామకం జరిగినప్పటి నుండి జుల్ఫీ ఏపీ కోసం ఏం పనులు చేశారు...? అనే విషయం తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: