అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిన్న జరిగిన వీడియో కాన్ఫరెన్స్ తరువాత ప్రధాని మోడీ లాక్ డౌన్ పొడగింపు పై ఒక నిర్ణయానికి వచ్చారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అన్ని రాష్ట్రాల సీఎంలు లాక్ డౌన్ ను పొడగించమని కోరగా ప్రధాని మాత్రం లాక్ డౌన్ పొడగింపు విషయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసినట్లు పీఎంఓ వర్గాలు నేషనల్ మీడియా కు తెలిపాయి.


సెంట్రల్ మినిస్ట్రీస్ కు చెందిన అధికారులను సోమవారం (ఏప్రిల్ 13) నుంచి విధులకు హాజరు కావాలంటూ ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ వల్ల పట్టాలు తప్పిన ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఒక పథకం రూపొందించాలని అధికారులను కోరారు ప్రధాని. ఇక ప్రస్తుతం నిత్యావసరాల సేవలకు మాత్రమే లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉండగా ఇకపై పరిశ్రమలకు కూడా లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు మోడీ.


ఇక ఏపీ సీఎం జగన్ ప్రతిపాదించిన రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్ల విధానంపైన ఐఏఎస్ ఆఫీసర్ల సలహా కోరారు ప్రధాని మోడీ. కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్న జిల్లాల్లో లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అని క్యాబినెట్ మంత్రులని అడిగి సలహా తీసుకున్నారు మోడీ. ఈ క్రమంలో వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం జగన్ చెప్పిన జోన్ల విధానం అమలు పరిచి, కరోనా ప్రభావం పెద్దగా లేని జిల్లాల్లో లాక్ డౌన్ ఆంక్షలను సడలించాలని ప్రధాని నిర్ణయించారు.


లాక్ డౌన్ వల్ల పరిశ్రమల మనుగడపై ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో పరిశ్రమలకు లాక్ డౌన్ నుంచి పూర్తి మినహాయింపు ను ఇవ్వనున్నట్లు సమాచారం. పరిశ్రమల్లో పూర్తి స్థాయిలో కార్మికులు పని చేసేందుకు పరిశ్రమలకు అనుమతి ఇవ్వనున్నారు. ఇక అలాగే చిరు వ్యాపారులు నష్ట పోకుండా వారి వారి వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతి ఇస్తారని తెలుస్తోంది. లాక్ డౌన్ పొడగింపు, పరిశ్రమలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు, ఇంకా జోన్ల విధానంపై ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: