మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత, ముందుచూపు గల మేధావి చంద్రబాబు నాయుడు 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, నవ్యాంధ్రకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. 1950 ఏప్రిల్ 20వ తేదీన నారావారిపల్లె గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో చంద్రబాబు జన్మించారు. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 
 
చంద్రబాబు బాల్యం నుంచే ప్రజాసేవ పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉండేవారు. విద్యాభ్యాసం పూర్తి కాకముందే కాంగ్రెస్ లో చేరిన ఆయన 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కొంతకాలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‍గా పని చేసిన చంద్రబాబు తరువాత కాలంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమితులయ్యారు. 
 
కాంగ్రెస్ కేబినెట్ లో తక్కువ వయస్సు గల మంత్రిగా చంద్రబాబు గుర్తింపు తెచ్చుకున్నారు. 1981, సెప్టెంబర్ 10వ తేదీన  సీనియర్ ఎన్టీయార్ కుమార్తె భువనేశ్వరీ దేవిని చంద్రబాబు వివాహం చేసుకున్నారు. సీనియర్ ఎన్టీయార్ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. 
 
తరువాత కాలంలో చంద్రబాబు టీడీపీలో చేరి టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేశారు. 1989లో టీడీపీ ఓడిపోవడంతో సీనియర్ ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా తప్ప ప్రతిపక్ష నాయకునిగా అడుగు పెట్టనని ప్రతిజ్ఞ చేశారు. ఆ సమయంలో టీడీపీ తరపున చంద్రబాబు ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించారు. 1989లో కుప్పం నుంచి ఎన్నికైన చంద్రబాబు తరువాత కాలంలో కూడా అక్కడినుంచే పోటీ చేస్తున్నారు. 
 
1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించగా చంద్రబాబు కుప్పం నుంచి ఎన్నికై ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా పని చేశారు. టీడీపీలో 1995లో సంభవించిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు 1999లో పార్టీని గెలిపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అత్యధిక కాలం పని చేసిన ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 
 
2004, 2009 ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోలేకపోయిన చంద్రబాబు 2014లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ వైసీపీ చేతిలో ఓటమిపాలైంది. టీడీపీ కేవలం 23 ఎమ్మెల్యే స్థానాల్లో, 3 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: