తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. చంద్రబాబు పూర్తిగా ఏపీకి పరిమితం కావడంతో, తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది.  2014 ఎన్నికల్లో ఓ మేర ప్రభావం చూపిన టీడీపీ, 2018 ఎన్నికలోచ్చేసరికి మరి దారుణమైన ఫలితాలని చవిచూసింది. కాంగ్రెస్‌తో పొత్తులో పోటీ చేసి కేవలం రెండు సీట్లు గెలుచుకుంది. ఖమ్మం జిల్లాలో అశ్వరావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్యలు గెలిచారు.

 

అయితే మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో మిగిలిన టీడీపీ నేతలు అందులోకి వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వీరయ్యకు గులాబీ గూటికి చేరుకున్నారు. మంత్రి పదవి హామీతోనే సండ్ర టీఆర్ఎస్‌లోకి వెళ్ళినట్లు తెలిసింది. అయితే వీరయ్య నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994 ఎన్నికల్లో పాలేరు నుంచి సి‌పి‌ఎం తరుపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 1999లో ఓడిపోయి, 2004లో టీడీపీలోకి వెళ్ళి అప్పుడు పాలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

 

ఇక 2009లో టీడీపీ తరుపున సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కూడా మళ్ళీ టీడీపీ నుంచి గెలిచి సత్తా చాటారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో, టీటీడీ దేవస్థానం మెంబర్‌గా పనిచేశారు. తర్వాత 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా వీరయ్య సత్తుపల్లి నుంచి  టీడీపీ తరుపున నిలబడి మంచి మెజారిటీతో గెలిచారు. కానీ రోజురోజుకూ టీడీపీ పరిస్థితి దిగజారిపోవడంతో వీరయ్య భవిష్యత్ కోసం టీఆర్ఎస్‌లోకి వచ్చారు.

 

కేసీఆర్ మంత్రి పదవి హామీ ఇవ్వడంతోనే వీరయ్య గులాబీ గూటికి వచ్చారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తుపల్లిలో గులాబీ జెండా ఎగిరేలా చేశారు. అయితే వీరయ్యకు ఇంకా మంత్రి పదవి దక్కలేదు. పైగా ఇప్పటిలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ చేసే అవకాశం కనిపించడం లేదు. మరి చూడాలి భవిష్యత్‌లో ఏమన్నా కేబినెట్ విస్తరణ జరిగితే వీరయ్యకు మంత్రి పదవి దక్కుతుందేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: