ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి తన క్యాబినెట్ ఏర్పాటు చేసిన రోజే తను ఎలాంటి అవినీతి, అక్రమాలు, దందాలు సహించన‌ని మంత్రులకు తొలి వార్నింగ్ ఇచ్చేశారు. జగన్ క్యాబినెట్ ఏర్పడి నెలరోజులు అయిందో లేదో అప్పుడే కొందరు మంత్రులు జగన్ గీసిన గీత దాటడం మొదలెట్టేశారు. ఈ విషయం సచివాలయంలో బాగా హల్చల్ చేయడంతో పాటు మీడియా సర్కిల్స్ లో ట్రెండ్ కావడంతో చివరకు ఆ నోట ఈ నోట జగన్ కు చేరిపోయింది. దీంతో జగన్ ఓ సీనియర్ మంత్రితో పాటు మరో న‌లుగురు జూనియర్ మంత్రులను పిలిచి వార్నింగ్ ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.


ఈ క్రమంలోనే ఈ మంత్రుల పై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. మంత్రులు ఈ నెల రోజుల్లో ఏం చేశారో ఆధారాలతో సహా జగన్ వివరించడంతో వారంతా షాక్ అయిపోయినట్టు వైసిపి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోసారి ఈ విధంగా జరిగితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించని కూడా జగన్ చెప్పినట్లు సమాచారం. జగన్ ముందుగానే క్యాబినెట్ మంత్రులు ప్రతి ఒక్కరికి మంత్రులు రెండున్నర ఏళ్ల పాటు ఉంటారని... ఆ తర్వాత జరిగే ప్రక్షాళనలో కొంత మందిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.


ఈ క్రమంలోనే చాలామంది రెండున్నర సంవత్సరాల పాటు ఏం చేసినా మంత్రిగా ఉంటామ‌న్న ధీమాతో ఉన్నార‌ని.. ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వ‌స్తే వారికి అదే చివరిరోజు అవుతుందని చెప్పేశారు. ఇదిలా ఉంటే ఓ మహిళా మంత్రి దగ్గర బంధువులు మంత్రి కి సంబంధించిన వ్యవహారాల్లో బాగా జోక్యం చేసుకుంటూ సచివాలయం దగ్గర బాగా హల్ చల్ చేస్తున్నారు అన్న విషయం కూడా ఇప్పటికే జగన్ దృష్టికి వెళ్లింది. దీంతో జగన్ సదరు మహిళా మంత్రిని పిలిచి మీ శాఖలో మీ బంధువుల పెత్తనం ఏంటి అని వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.  జగన్ వార్నింగ్ ఇచ్చిన మహిళా మంత్రి ఎవరు అన్నదానిపై కూడా వైసిపి వర్గాల్లో చర్చ నడుస్తుంది. జ‌గ‌న్ కేబినెట్‌లో సుచరిత‌తో పాటు తానేటి వనిత‌, పాముల పుష్పశ్రీ వాణి మ‌హిళా మంత్రులుగా ఉన్నారు. వీరిలో జ‌గ‌న్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి ఈ ముగ్గురిలో సీనియ‌ర్ అని టాక్‌.



మరింత సమాచారం తెలుసుకోండి: