72వ సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఫలితాలు వెలువడ్డాయి. మొదటి నుంచి తెలుగుదేశం వెనుకబడటం, వైఎస్సార్ పార్టీకి సంబంధించిన అభ్యర్ధులు దూసుకుపోవడం ఫలితాల వెల్లడిలో చూస్తూనే ఉన్నాం. చివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో ఎవరూ ఊహించని విధంగా రాజకీయ ఫలితాలను తిరగరాసారు. ఓంటరి పోరులో ఇప్పటి వరకు జాతీయ పార్టీలకు కూడా దక్కని అంచనాలు రాష్ట్రంలో జగన్ సాధించారు.


అయితే తెలుగుదేశం ఓటమికి చాలా కారణాలే ఉన్నాయి. గత ఐదు సంవత్సరాలలో టీడీపీ దాదాపు 107 కొత్త పథకాలు ప్రవేశపెట్టింది. పసుపు-కుంకుమ, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్లు వంటివి విపరీతమైన ప్రజాదరణ పొందాయని భావించారు. దాదాపు 95 లక్షల మంది డ్వాక్రా మహిళలు, సుమారు 55లక్షల మందికి ఇస్తున్న పింఛన్‌ లబ్ధిదారులు తమకు అండగా ఉన్నారు.. సులువుగా విజయం సాధించొచ్చని అనుకున్నారు. మహిళా పోలింగ్‌ శాతం ఎక్కువగా నమోదవ్వడం కలిసి వస్తుందని నమ్మారు. కానీ వారు వేసిన ఓట్లు టీడీపీకి కాకుండా వైసీపీకి పడ్డాయి. తొలుత డ్వాక్రా సంఘాల మహిళలకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. తర్వాత దాన్ని పెట్టుబడి నిధిగా మార్చి.. చివరికి పసుపు - కుంకుమగా తెదేపా అమలు చేసింది. రూ.200 నుంచి రూ.2,000కు పింఛన్లు పెంచి ఇస్తున్నా ఆశించిన ప్రభావం చూపలేదు.


టీడీపీ అధినేతగా బాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ మూడుసార్లు ఓటమిని చవిచూశారు. 2004, 2009లో రెండు సార్లు ప్రత్యర్థిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నారు. ఈ ఎన్నికల్లో జగన్‌ ప్రత్యర్థిగా ఉన్నారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించడానికి వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చెపట్టి ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో ప్రజలను కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కూడా రాష్ట్రంలోని ప్రతి పల్లేకు బస్సు ద్వారా యాత్రలను కొనసాగించి గ్రామాల్లో పేదలతో పాటు తిని, వారి గూడిసెల్లో నిద్రించేవారు. వైఎస్ఆర్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకువచ్చి సొంత పార్టీని స్థాపించారు.

2013 ఎన్నికల్లో సమైఖ్యాంధ్ర ఉధ్యమం చేపట్టినా సొనియా గాంధీ 2014 ఎన్నికల ముందు రాష్ట్రాన్ని విడదీసింది. దీంతో చంద్రబాబు 2014 ఎన్నికల్లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ పాదయాత్ర చేసి, పార్టీలతో పొత్తులు పెట్టుకొని గెలుపోందారు. ఇప్పుడు జగన్ పాదయాత్ర ద్వారా 2019లో ఒంటరిగా పోరాటం చేసినా అత్యధికంగా గెలుపొందారు. ఇక్కడ మరో కారణం కూడా ఉంది. చంద్రబాబు గెలుపొందిన ప్రతిసారి పార్టీలతో పొత్తులు పెట్టుకునే వారు. ఈ సారి రాష్ట్రంలోని అన్ని పార్టీలను విమర్శిస్తూ, కెంద్రంలోని భారతీయ జనతా పార్టీ ద్రోహం చెసిందని ఎద్దేవా చేశారు. దీనిని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు.


ఎన్నికల్లో విజయానికి వ్యూహకర్తగా ప్రశాంత్‌కిషోర్‌ను వైకాపా నియమించుకుని పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఆయన వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించటంలో టీడీపీ దారుణంగా విఫలమైంది. గ్రూప్‌ ‘ఎం’ని నియమించుకున్నా ప్రయోజనం లేకపోయింది. వైసీపీకి అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో దాదాపు 250 మేర ఛానళ్లు, గ్రూపులు, వెబ్‌సైట్లు పనిచేస్తున్నాయని తెదేపా గుర్తించినా.. తిప్పికొట్టలేకపోయింది. సీఎం తీరిక లేకుండా ఉండటంతో కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేలూ క్షేత్రస్థాయి స్థితిగతులు చెప్పడానికి జంకేవారు.

ఎన్నికల్లో తెరవెనుక పనిచేసే బ్యాక్‌ ఆఫీస్‌ ఎంతో ముఖ్యమైంది. ఈ విడత అది సరిగా వ్యవహరించలేకపోయింది. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవ్వగా.. ప్రధాన కార్యదర్శి లోకేష్‌ తన స్థానంపై దృష్టిపెట్టారు. బ్యాక్‌ ఆఫీస్‌ అంత చురుగ్గా వ్యవహరించలేకపోయింది. మొత్తంగా ఐదేళ్ల కాలమంతా హడావిడిగా సాగడంతో లోటుపాట్లు గుర్తించి, అధిగమించేలా కృషి చేయకపోవటం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందని సీనియర్‌ నాయకుడొకరు అభిప్రాయపడ్డారు.


టీడీపీకు చిరకాలంగా కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్ని ఈ ఎన్నికల్లో కాపాడుకోలేకపోయింది. గతంలో చేజారిన వాటిని తిరిగి దక్కించుకోలేకపోయింది. ఉత్తరాంధ్ర తెదేపాకు కంచుకోట. విశాఖ నగరం మినహా ఎక్కడా ప్రభావం లేదు. విజయనగరం జిల్లాలో మృణాళిని తొలగించాక బీసీలకు అవకాశమివ్వలేదు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు తెలుగుదేశానికి తీరుగేలేదు. అలాంటి అక్కడ సీట్లను కూడా కాపాడుకోలేకపోయింది. ఇక్కడ ఒంటరి పోరు కాకుండా అభ్యర్థులు ఎక్కువ మంది కావడంతో ఓట్ల చీలీక ఎక్కువై టీడీపీకి తక్కువ పోలయ్యాయి. 


గత కొన్నేళ్లుగా ఎన్నికల్లో ఆర్థిక వనరులు గణనీయ ప్రభావం చూపుతున్నాయి. టీడీపీకి వనరులు అందకుండా చూడటంలో ప్రత్యర్థులు సఫలమయ్యారు. కనీసం 50చోట్ల పార్టీ విజయావకాశాలపై ఇది ప్రభావం చూపినట్లు తెదేపా అంచనా. అలానే గత ఐదేళ్లలో యువతను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించినా ఆఖరి ఏడాదిలోనే అమలు చేసింది. చెప్పుకోదగ్గస్థాయిలో ఉద్యోగాలు కల్పించలేకపోయారు.


చెన్నై, హైదరాబాద్‌ను వదిలి వచ్చిన ఆంధ్రులకు సొంత రాజధాని నిర్మాణం స్వప్నంగా మిగిలిపోయింది. దానిని సాకారం చేసే దిశగా కృషి చేసినా ప్రజలకు చేరలేదు. శాశ్వత భవనాలను నిర్మించకుండా ముందు గుంటూరు, విజయవాడ పరిధిలోని పలు భవనాలను అద్దెలకు తీసుకొని కార్యకలపాలు నిర్వహించారు. అనంతరం వెలగపూడిలో భవనాలు నిర్మించినా అవి శాశ్వత భవనాలు కాదు. కేవలం తాత్కాలికం. దీంతో ప్రజాధనం నిరుపయోగమైంది ప్రజలు భావించారు. రాజధాని ఉన్న మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోనూ పార్టీ ఓడిపోయింది. ప్రణాళికల్లో కాలమంతా గడచిపోయి కీలక నిర్మాణాలు పూర్తి కాలేదు. పోలవరం, పట్టిసీమ, రాయలసీమకు నీరివ్వడం పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: