గత ప్రభుత్వ హయాంలో మన కళ్లముందే ఇసుక దోపిడీ, అక్రమ మైనింగ్‌, పేకాట క్లబ్బుల నిర్వహణ, ఎమ్మెల్యేల అక్రమ వసూళ్లు, రాజధానికి భూములివ్వని రైతులపై తప్పుడు కేసులు, వేధింపుల వంటివి అనేకం చోటుచేసుకున్నాయని, అగ్రగామి పోలీసింగ్‌ అంటే వాటన్నింటినీ చూస్తూ ఊరుకోవడమేనా? అని పోలీసు ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.

 

సినిమా థియేటర్లు, సంస్థల నుంచి కొంత మంది ఎమ్మెల్యేలు డబ్బులు వసూలు చేసేవారు. పేకాట క్లబ్బుల నిర్వహణలో ఎమ్మెల్యేలు భాగస్వాములయ్యారు. రాజధాని కోసం భూ సమీకరణలో భూములివ్వని రైతులను తప్పుడు కేసులతో తీవ్రంగా వేధించారు. ఫలితంగా రాజధాని పరిధిలో 11 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందులో ఆరుగురు దళిత రైతులే. సుపరిపాలనంటే ఇదేనా?

 

విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌తో మహిళలను వేధించారు. తీసుకున్న అప్పులు చెల్లించలేదని లైంగిక దోపిడీకి పాల్పడ్డారు. ఇంత తీవ్రమైన నేరంపై ఎన్ని కేసులు నమోదు చేశారు? ఎంత మందిని అరెస్టు చేశారు? అత్యుత్తమ పోలీసింగ్‌ అంటే ఇదేనా?

 

మీ వద్దకు వచ్చే ఎమ్మెల్యేలనే కాదు. సామాన్య ప్రజానీకాన్నీ నవ్వుతూ ఆహ్వానించండి. వారి సమస్యలను పరిష్కరిస్తామనే నమ్మకం కల్పించండి. మీ కోసమే మేమున్నామనే భరోసా ప్రజల్లో కల్పించండి. మనం పాలకులం కాదు.. ప్రజాసేవకులం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎదిగే కొద్దీ ఒదిగే తత్వాన్ని నేర్చుకోవాలి. మా నాన్న నుంచి దీన్ని అలవరుచుకున్నా అని సీఎం చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: