అత్యధిక సినిమాలు తెరకెక్కించిన మహిళా దర్శకురాలిగా తెలుగు సినిమా రంగంలో మహిళల ప్రాధాన్యతను పెంచిన ఘనత శ్రీమతి విజయనిర్మల గారికి దక్కుతుంది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ... పలువురు రాజకీయ వేత్తలు తమ సంతాపాన్ని తెలియజేసారు.

 

వెంకయ్యనాయుడు: ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల మృతిపట్ల యావత్‌ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. విజయ నిర్మల కన్నుమూశారన్న వార్త తనని తీవ్రంగా కలచి వేసిందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు.

 

జగన్మోహన్‌రెడ్డి: విజయ నిర్మల కన్నుమూయడంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపిన సీఎం జగన్‌ అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్‌ బుక్ రికార్డు సాధించిన మేటి దర్శకురాలైన విజయనిర్మల మరణం చిత్రపరిశ్రమకు తీవ్ర లోటని విచారం వ్యక్తం చేశారు.

 

చంద్రబాబునాయుడు: సీనియర్ నటి విజయనిర్మల మరణం దిగ్భ్రాంతికరం. నటిగానే కాక దర్శకురాలిగా అనేక కుటుంబ కథాచిత్రాలను అందించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ,వారి అభిమానులకు, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను...

 

తలసాని: విజయనిర్మల మృతి పట్ల తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణంతో చిత్ర పరిశ్రమ ప్రముఖ దర్శకురాలు, నటిని కోల్పోయిందన్నారు. విజయనిర్మల మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

 

గల్లా జయ్‌దేవ్‌: శ్రీమతి విజయ నిర్మలగారు ఇకలేరన్న వార్త వినడం విచారకరం. నటిగా, దర్శకురాలిగా చిత్ర పరిశ్రమకు అపారమైన సేవలు అందించారు. కృష్ణగారి కుటుంబానికి, చిత్ర పరిశ్రమకు మంచి సలహాలు, సూచనలు అందించే వ్యక్తిని కోల్పోయాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: