రమ్య హరిదాస్.. పాతికేళ్ల వయసు.. నిరుపేద దళిత కుటుంబం.. నాన్న దినసరి కూలీ.. అమ్మకి కాంగ్రెస్ అంటే పంచప్రాణాలు. అమ్మ ఆలిండియా మహిళా కాంగ్రెస్ లో పనిచేశారు. చిన్నప్పుడు అమ్మతో పాటు వెళ్లి రమ్య చదువుకుంటూనే కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా ఎదిగారు. కాలేజీ యూనియన్ లీడర్ గా మొదలైన ఆమె రాజకీయ ప్రస్తానం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నమ్మకంతో ఇప్పుడు ఎంపీగా ఎన్నికైన అందరి మనసు గెలుచుకుంది.

తాజాగా రమ్య ఒక నిరుపేద దళిత కుటుంబం నుంచి పార్లమెంట్ ఎంపీగా ఎదిగిన తీరును ప్రశంసిస్తూ ఒక వీడియోను పోస్టు చేశారు ప్రియాంక గాంధీ. ఆదివాసీలు - దళితుల సమస్యలపై పోరాడి పేరు తెచ్చుకున్న ఆమె తీరును కొనియాడారు. మంచి వాగ్ధాటి - ప్రజాసమస్యలపై అవగాహన ఉన్న రమ్యకు రాహుల్ గాంధీ టికెట్ ఇస్తానంటే తప్పుపట్టింది కాంగ్రెస్ అధిష్టానం. కానీ రాహుల్ పట్టిపట్టి ఇప్పించాడు. 

ఆమె బాధ్యత తీసుకోలేదు. కానీ రమ్య ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. మంచి వాగ్ధాటితో ప్రజల అవసరాలు తెలుసుకుంటూ.. వారితో మమేకమై దగ్గరయ్యారు. ఏకంగా కమ్యూనిస్టుల కంచుకోట అయిన అలత్తూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేసి బలమైన సీపీఐ (ఎం)కు చెందిన పీకే బిజూను ఓడించారు. ఇదో సంచలనమే అయ్యింది. ఎందుకంటే ఆయన వరుసగా 2009 - 2014లో గెలిచి హ్యాట్రిక్ మీదున్నారు. సాధారణ దళిత యువతి ఆయనను ఓడించింది.

తన దగ్గర ప్రచారానికి కూడా డబ్బుల్లేని స్థితిలో రమ్య క్రౌండ్ ఫండింగ్ ద్వారా విరాళాలు సేకరించింది. పెన్షన్ డబ్బులో కోంత - వైద్యం డబ్బులు - ఇలా దాచుకున్న సొమ్మును ప్రచార సభల్లో ప్రజలే స్వచ్ఛందంగా ఇచ్చి ఆమెను గెలిపించడం విశేషం. అందుకే గెలిచాక తనకు వచ్చే ఎంపీ జీతం కూడా అలత్తూర్ ప్రజల కోసమే ఖర్చు చేస్తానని రమ్య చెప్పడం విశేషం. కేరళ నుంచి కాంగ్రెస్ తరుఫున గెలిచిన ఏకైక దళిత ఎంపీగా యువ రమ్య కొత్త రికార్డును సృష్టించారు. ఇది ఈమె ఒక్కరి విజయం కాదు.. ప్రజలందరి విజయంగా అక్కడి వారు అభివర్ణిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: