వైసీపీ అధినేత‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం రాష్ట్రంలో పింఛ‌న్ల‌పై ఆధార‌ప‌డి జీవిస్తున్న వృద్ధులు, విక‌లాంగులు, వితంతువులు, ఒంట‌రి మ‌హిళ‌ల‌పై ప్ర‌భావం చూపిస్తోంది! ప్ర‌స్తుతం తాత అవ్వ‌ల‌కు రూ.2000 పింఛ‌న్ రూపంలో ఇస్తున్నారు. దీంతో వృద్ధులుదీనిపై చాలా వ‌ర‌కు ఆశ‌లు పెట్టుకున్నారు. వారికి అవ‌స‌ర‌మైన మందులు, ఆహారం కొనుగోలు చేసుకునేందుకు పింఛ‌న్ ఆస‌రాగా మారింది.

 

అయితే, జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక, సీఎంగా ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే ఈ పింఛ‌న్‌ను ఆయ‌న రూ.250 చొప్పున పెంచుతూ.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అంతేకాదు, ఏటా దీనిని రూ.250 చొప్పును పెంచుకుంటూ.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వృద్ధుల‌కు రూ.3000 చొప్పున పింఛ‌న్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇది జరిగి నెల అయింది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లూ కూడా పూర్త‌య్యాయి.

 

జ‌గ‌న్ చెప్పిన‌ట్టు ఈ పింఛ‌న్ల పెంపు జూలై 1 నుంచి అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని అంద‌రూ భావించారు. అయితే, జ‌గ‌న్ అనూహ్యమైన నిర్ణ‌యం తీసుకున్నారు. జూలై 8న దివంగ‌త త‌న తండ్రి, మాజీ సీఎం వైఎస్ జ‌యంతి ఉన్నందున ఆ రోజు నుంచి ఈ పెంచిన పింఛ‌న్ల‌ను అమ‌లు చేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించారు. అయితే, సాధార‌ణంగా ప్ర‌తి నెలా ఒక‌టో తారీఖునే పింఛ‌న్ వ‌స్తుంద‌ని ఎదురు చూసిన అవ్వ‌తాత‌ల‌కు ఈ విష‌యం తెలియ‌క పోవ‌డంతో నిన్న‌టి నుంచి అంటే 1వ తారీఖు నుంచి వారు పింఛ‌న్ ఇచ్చే కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.

 

త‌న పాల‌న, నిర్ణ‌యాల విష‌యంలో ఆర్భాటాలు ఇష్టం లేద‌ని, ప్ర‌చార ఆర్భాటాల‌కు తాను దూరంగా ఉంటాన‌ని చెప్పిన జ‌గ‌న్ అత్యంత కీల‌క‌మైన పింఛ‌న్ల విష‌యంలోనూ ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వృద్ధుల‌తో ముడిప‌డిన వ్య‌వ‌హారం కాబ‌ట్టి ఈ నెల వ‌ర‌కు 1వ తారీకున ఇచ్చే పింఛ‌న్‌ను 8నుంచి ఇస్తామ‌ని విస్తృతంగా ప్ర‌చారం క‌ల్పిస్తే.. బాగుండేద‌ని, వృద్ధుల‌కు ఇబ్బందులు ఉండేది కాద‌ని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: