తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని, రాజరిక, కుటుంబ పాలన కొనసాగిస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు విశ్రమించేది లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. అల్వాల్‌లోని శుభశ్రీ గార్డెన్స్‌లో జరిగిన మేడ్చల్‌ జిల్లా కార్యవర్గ సమావేశం, కార్పొరేట్‌ ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా బీజేవైఎం తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు ఎదుట జరిగిన నిరసన దీక్షలో ఆపార్టీ నేతలు మురళీధర్‌రావు ఇతర నాయుకులు పాల్గొన్నారు.

 

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు జి. భరత్‌గౌడ్, జాతీయ కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, నగర అధ్యక్షుడు వినయ్‌కుమార్‌ తదితరులతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కార్యదర్శులు నిరసన దీక్షలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ..  కార్పొరేట్‌  ఫీ‘జులుం’, నిరుద్యోగ సమస్యపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీ‘జులుం’ కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

రాష్ట్రంలో పేద విద్యార్థులు ‘చదువుకొనాల్సిన’ పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్పొరేట్‌ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తుందని విమర్శించారు. 2016లో టీఆర్‌టీ పేరుతో నియామక నోటిపికేషన్‌ ఇచ్చి పరీక్షలు నిర్వహించి మూడేళ్లు అవుతున్నా టీచర్‌ పోస్టులకు సెలెక్ట్‌ అయిన అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వక పోవడం శోచనీయమన్నారు. ఆరేళ్లుగా ఒక్క టీచర్‌ పోస్టు భర్తీ చేయని కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే హక్కు ఉందా అని ప్రశ్నించారు.

 

ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలు తెలంగాణకే కళంకమని, దీనికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బాధ్యత వహించాలని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. ఆత్మహత్యలకు కారణమైన గ్లోబరీనా సంస్థను శిక్షించకపోవడం శోయనీయమన్నారు. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై బీజేవైఎం పెద్ద ఎత్తున ఉద్యమించినా ప్రభుత్వం స్పందించలేదని, 27 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారకులైన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: