దేశంలో రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఈ రోజు సార్వత్రిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్ట‌నుంది. అయితే, గ‌తానికి భిన్నంగా, మ‌రో మాట‌లో చెప్పాలంటే.. కేంద్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌ని విధంగా ఆర్థిక శాఖ‌కు ఓ మ‌హిళ మంత్రిగా ఉన్నారు. ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నిర్మ‌లా సీతారామ‌న్‌.. ప్ర‌స్తుతం మోడీ ప్ర‌బుత్వంలో ఆర్థిక శాఖ ప‌గ్గాలు చేప‌ట్టారు. నిజాయితీకి, పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద పీట వేసే నిర్మ‌ల‌పై మోడీ స‌హా దేశంలోని అన్ని  వ‌ర్గాల ప్ర‌జ‌లు ఎన్నోఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రీ ముఖ్యంగా మ‌హిళ‌లు నిర్మ‌ల సిద్ధ చేసిన బ‌డ్జెట్‌పై వెయ్యి క‌ళ్ల‌తో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. దీనికి ప్ర‌దాన కార‌ణాలు మూడు ఉన్నాయి. మ‌రి ఈ విష‌యంలో నిర్మ‌ల నిర్ల‌క్ష్యంగా గ‌త మంత్రులగానే వ్య‌వ‌హ‌రిస్తారా?  లేక మ‌హిళ‌ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తారా చూడాలి.


దేశ‌వ్యాప్తంగా మ‌హిళా ఉద్యోగినులు కేంద్ర ఆర్థిక మంత్రిపై ఆశ‌లు పెట్టుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 38% మంది మ‌హిళా ఉద్యోగులు రాష్ట్ర‌, కేంద్ర స్థాయి సంస్థ‌ల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే, వీరంతా కూడా ఆదాయ ప‌న్ను ప‌రిధిని పెం చాల‌ని గ‌డిచిన మూడు బ‌డ్జెట్ల నుంచి కూడా కేంద్రాన్ని కోరుతున్నారు. అయినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు వీరిని ప‌ట్టించు కున్న వారు లేరు. ప్ర‌స్తుతం 2.5 ల‌క్ష‌లుగా ఉన్న ఆదాయ ప‌న్ను ప‌రిమితిని క‌నీసం మ‌హిళ‌ల వ‌ర‌కైనా 5ల‌క్ష‌ల‌కు పెంచాల‌నేది వీరి ప్ర‌ధాన డిమాండ్‌. అదేస‌మ‌యంలో ప్ర‌మోష‌న్ల‌లోనూ మ‌హిళ‌ల‌కు కోటా ఉండాల‌ని కోరుతున్నారు. ఈ రెండు ప్ర‌ధాన డిమాండ్ల‌పై నిర్మ‌ల న్యాయం చేస్తార‌ని తాజా బ‌డ్జెట్‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. ఏం చేస్తారో చూడాలి.


ఇక‌, మ‌హిళ‌ల‌కు అత్యంత ప్రీతిపాత్ర‌మైన ప‌సిడిపై సుంకాల‌ను త‌గ్గించాల‌ని దేశ‌వ్యాప్తంగా మ‌హిళ‌లు మొర పెట్టుకుం టున్నారు. ప్ర‌స్తుతం 10గ్రాముల బంగారం ధ‌ర అటు ఇటుగా 35 వేల‌కు చేరింది. దీనిని క‌నీసం 5 వేల నుంచి 7 వేలు త‌గ్గేలా సుంకాల‌ను త‌గ్గించాల‌ని మ‌హిళ‌లు కోరుతున్నారు. అదేవిధంగా మ‌హిళ‌ల ఆభ‌ర‌ణాల‌పై త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క స‌హా కొన్ని రాష్ట్రాల్లో ప్ర‌త్యేక రాయితీలు ఇవ్వాల‌నే డిమాండ్ ఉంది. దీనిపై కేంద్రం ఇప్ప‌టి వ‌ర‌కు నిర్ణ‌యం ప్ర‌క‌టించ లేదు. ఇప్పుడు మ‌హిళే సార‌ధ్యం వ‌హిస్తున్న శాఖ కాబ‌ట్టి దీనికి అనుకూలంగానే నిర్ణ‌యం ఉంటుంద‌ని ఆశిస్తున్నారు. మ‌రి నిర్మ‌ల ఆదిశ‌గా అడుగులు వేస్తారా?  లేదా చూడాలి.


మ‌రో కీల‌క‌మైన మ‌హిళా డిమాండ్ నిత్యావ‌ర‌స‌ర సరుకుల‌పై కేంద్ర ప‌న్నుల త‌గ్గింపు. ప్ర‌స్తుతం బియ్యం ఉప్పు స‌హా అన్ని నిత్యావ‌స‌ర స‌రుకుల‌పై జీఎస్టీ 18% నుంచి 28% వ‌ర‌కు కూడా వేస్తున్నారు. వీటికి స‌రైన ప్ర‌తిపాద‌న‌లు కూడా క‌రువ‌వ‌డంతో ఎక్క‌డిక‌క్క‌డే ప‌న్నుల స్లాబులు అమ‌ల‌వుతున్నాయి. ఇక‌, జీల‌క‌ర్ర‌, మిరియాలు, అల్లం, యాల‌కులు, దాల్చిన చెక్క‌, స‌బ్జా గింజ‌లు, వెల్లుల్లి వంటివి సుగంధ ద్ర‌వ్యాల జాబితాలో ఉన్నాయి. దీంతో వీటిపై భారీ ఎత్తున ప‌న్నులు వ‌సూలు చేస్తున్నారు. నిత్యం ఇవి లేనిదే... వంట చేసుకోలేని మ‌హిళా మ‌ణులు వీటిని సాధార‌ణ స‌రుకులుగా ప‌రిగ‌ణించాల‌ని కోరుతున్నారు. మ‌రి ఈ బ‌డ్జెట్‌లోనైనా ఈ ప్ర‌తిపాద‌న అమ‌ల‌వుతుందా?  నిర్మ‌ల ఏం చేస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: