ఏపీ రాష్ట్ర 2019-20 వార్షిక బ‌డ్జెట్ శుక్ర‌వారం అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. రాష్ట్రంలో మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు, ఏర్ప‌డిన కొత్త ప్ర‌భుత్వం నేప‌థ్యంలో బ‌డ్జెట్‌పై అంద‌రికీ ఆస‌క్తి పెరిగింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెడుతున్న బ‌డ్జెట్ అంకెల గార‌డీ చేస్తుందా.. సంక్షేమ విన్యాసం చేస్తుందా? అనే చ‌ర్చ కూడా సాగుతోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 5వ తేదీనే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టింది. నిజానికి ఇది మూడు మాసాలకు మాత్రమే ప‌రిమితం అయ్యే బ‌డ్జెట్ అయితే. చంద్ర‌బాబు మాత్రం సుదీర్ఘ ల‌క్ష్యాల‌ను, సుదీర్ఘ సంక్షేమాన్ని ప్ర‌స్థావించారు. 


దీంతో ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్ట‌నున్న బ‌డ్జెట్ ఏమేర‌కు ఈ అంచ‌నాల‌ను అందుకుంటుందో చూడాలి. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రైతుల‌కు, మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేస్తూ.. అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కాన్నితెర‌మీదికి తెచ్చింది. అదేవిధంగా ప‌సుపు-కుంకుమ పేరుతో మ‌హిళ‌ల‌కు కానుక‌లు ఇచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిలో ప‌సుపు-కుంకుమ ప‌థ‌కానికి జ‌గ‌న్ విముఖ‌త వ్య‌క్తం చేశారు. అదేస్థానంలో మ‌హిళ‌ల‌కు డ్వాక్రా రుణాల మాఫీని ప్ర‌క‌టించారు. అయితే, దీనిని ఎలా అమ‌లు చేస్తారు? అనేది ఈ బ‌డ్జెట్‌లో ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. 


అదే స‌మ‌యంలో అన్న‌దాత సుఖీభ‌వ ప్లేస్‌లో రైతు భ‌రోసాను తీసుకువ‌చ్చారు. ఇప్ప‌టికే ఈ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేయ‌డం ప్రారంభించారు. రాబోయే రోజుల్లో దీనిని విస్త‌రించే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో దీనికి నిధులు ఇబ్బ‌డి ముబ్బ‌డిగానే ఉండ‌నున్నాయి. ఇక‌, అత్యంత కీల‌క‌మైన రెవెన్యూ లోటును గ‌త ప్ర‌భుత్వం ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో రూ.2099  కోట్లుగా చూపించింది. కేంద్ర ప‌న్నుల్లో వాటా 36 వేల పైచిలుకు కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ 63 వేల పైచిలుకు కోట్లు, వివిధ రూపాల్లో ప్ర‌భుత్వానికి అందే ఆదాయం.. రూ. 75 వేల పైచిలుకు కోట్లు వ‌స్తుంద‌ని అప్ప‌ట్లో ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల లెక్క‌లు చెప్పారు. 


అయితే, ఇప్పుడు మారిన ప్రాధాన్యాల నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఆదాయానికి గండి ప‌డే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా మ‌ద్యం ఆదాయాన్ని ప్ర‌బుత్వం త‌గ్గించుకుంటోంది. అదేస‌మ‌యంలో ఆర్టీసిని ప్ర‌భుత్వంలో విలీనం చేయాల‌నే ప్ర‌తిపాద‌న కూడా ఉంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్ట‌నున్న బ‌డ్జెట్ అంకెల గార‌డీ చేస్తుందా? స‌ంక్షేమ విన్యాసం చేస్తుందా? అనేది ఆస‌క్తిగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: