కోటి విద్యలు కూటి కొరకే అంటారు.. ఎంతటి ధనవంతుడైనా తినేది అన్నమే.. బంగారం కాదు.. పొట్ట కూటి కోసమే ఎవరు ఏ పని చేసినా.. కానీ డబ్బు సంపాదనలో పడి చాలా మంది ఈ సాధారణ సూత్రం మరిచిపోతారు. పక్కవాడు తిండిలేక ఉపవాసం ఉంటున్నా.. తమ సంగతి తాము చూసుకుంటారు చాలా మంది.


కానీ ఆ హోటల్ యజమాని మాత్రం అలా కాదు.. పర్వాలేదు.. డబ్బులు ఉంటే బిల్లు కట్టండి.. లేకపోయినా పర్వాలేదు.. కానీ.. కడుపు నిండా తిని వెళ్లండి అంటాడు.. ఇంతకీ ఈ హోటల్ ఎక్కడ ఉందంటారా.. దుబాయ్ లో ఉంది. 39 ఏళ్ల ఫాదీ అయ్యద్ అనే మహానుభావుడు ఈ హోటల్ నడుపుతున్నాడు. ఈ రెస్టారెంట్ పేరు ఫౌల్ డబ్ల్యూ హమ్మస్ .


ఈ హోటల్ కు వెళ్లగానే ముందు ఓ బ్యానర్ కనిపిస్తుంది. "మా హోటల్ లో భోజనం చేసి డబ్బులు ఉంటే బిల్లు చెల్లించండి. లేకపోతే ఉచితంగా తినండి..ఇది అల్లా ఇస్తున్న బహుమతి" అని దానిపై రాసి ఉంటుంది. ఈ విధానంతో అయ్యద్ కు మానవత్వం ఉన్న వ్యాపారిగా మంచిపేరు వచ్చింది.


అయితే ఫ్రీగా పెడతా అన్నాడు కదా అని ఎవరూ ఫ్రీగా తినరు లెండి. ఆకలితో ఉండి.. డబ్బు లేని వారు రోజుకు 30 నుంచి 40 మంది వరకూ ఫ్రీగా తింటారట. ఆస్ట్రేలియాకు చెందిన ఒక మహిళ దాదాపు సంవత్సరం నుంచి తన రెస్టారెంట్ లో ఉచితంగా భోజనం చేస్తోందట. డబ్బుల కోసమే తాను వ్యాపారం చేస్తున్నా.. తనకు వచ్చే దాంట్లో ఎంతో కొంత ఈ విధంగా సహాయం చేయాలని నిశ్చయించుకున్నట్లు ఆయన చెబుతున్నారు.


ఇలా ఫ్రీ భోజనం తాను పబ్లిసిటీ కోసం చేయటంలేదంటున్నాడాయన. ఫ్రీగా భోజనం పెడితే నష్టాలు వస్తాయి కదా అనుకుంటున్నారా.. ఈయన మాత్రం తనహోటల్ మంచి లాభాల్లోనే నడుస్తుందంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: